యూనిట్

నేరస్థల పరిశోధనలో భౌతిక సాక్ష్యాధారాల సేకరణ - రవాణా

ఫోరెన్సిక్‌ భౌతిక శాస్త్ర విభాగం

ఆడియో - వీడియో ప్రామాణికత పరీక్షలు

ఫోరెన్సిక్‌ భౌతిక సాక్ష్యాధారాల వలే కాకుండా ఆడియో మరియు వీడియో రికార్డింగులు దర్యాప్తు అధికారికి దర్యాప్తుకే కాకుండా కోర్టులలో ప్రత్యక్ష సాక్షుల వలె  ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. నేటి డిజిటల్‌ ప్రపంచంలో క్లోజ్డ్‌ సర్క్యూట్‌ టెలివిజన్‌ సిస్టమ్‌ (సిసిటివి) వంటి అత్యాధునిక ఆడియో మరియు వీడియో రికార్డర్లను వ్యాపార సంస్థల్లో, షాపుల్లో, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద, పార్కింగు స్థలాల్లో, బ్యాంకుల్లో, ఏటిఎమ్‌ సెంటర్లు వంటి  ముఖ్య ప్రదేశాల్లో వీటి ఉపయోగం  సర్వ సాధారణమైపోయింది. ఉదాహరణకు ఇటువంటి టెక్నాలజీ  ఉపయోగం వలననే దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్ళ నిందితులను గుర్తించుటలో, మలక్‌పేట్‌ స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో చెన్నై డైవర్షన్‌ అటెన్షన్‌ గ్యాంగ్‌ను గుర్తించుటలో, ఎన్నో ట్రాఫిక్‌ యాక్సిడెంట్‌కేసులలో, ముత్తూట్‌ ఫైనాన్స్‌ రాబరీ ముఠాలను కనుగొనడం, రోడ్డు యాక్సిడెంట్లలో ప్రముఖులు దుర్మరణం చెందినప్పుడు ఈ సీసీటీవీ ఆడియో, వీడియో రికార్డింగుల ద్వారా లభించిన సమాచారం దర్యాప్తునకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మత సంబంధిత వివాదాస్పద వ్యాఖ్యల రికార్డింగులలో వ్యక్తుల గుర్తింపు మరియు ఆడియో, వీడియో ప్రామాణికత దర్యాప్తుకు ఎంతో కీలకం.

ఆడియో వీడియో ప్రామాణికత నిర్ధారణకు దర్యాప్తు అధికారి ఫోరెన్సిక్‌ సైన్స్‌ ప్రయోగశాలకు పంపే భౌతిక సాక్ష్యాధారాలు:

వీడియో టేపులు, వీడియో ప్లేయర్లు, వీడియో కెమెరాలు, సీిడీలు, డీవిడీలు, హార్డ్‌ డిస్క్‌లు, మెమొరీ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు, సీసీటీవీ రికార్డింగ్‌లు, సెల్‌ఫోన్లు మొదలగునవి.

ఫోరెన్సిక్‌ భౌతిక శాస్త్ర విభాగంలో నిర్వహించే పరీక్షలు - ఫలితాలు:

1. వీడియో టేపులు, వీడియో ప్లేయర్లు, వీడియో కెమెరాలు, సీిడీలు, డీివిడీలు, హార్డ్‌ డిస్క్‌లు, మెమొరీ కార్డులు, పెన్‌డ్రైవ్‌లు, సీసీటీవి రికార్డింగ్‌లు, సెల్‌ఫోన్లు వంటివి ఉష్ణ ప్రభావం వల్ల, ఉద్దేశ్యపూర్వకంగా నాశనం చేయటం వలన లేదా ఇతర కారణాల వలన పనిచేయకుండా పోవచ్చు. అటువంటి సాక్ష్యాలను ఫోరెన్సిక్‌ నిపుణులు శాస్త్రీయ పరికరాల సహాయంతో ఆ సాక్ష్యాధారాలలోని అనలాగ్‌ మరియు అయస్కాంత టేప్‌లలోని సాక్ష్యాన్ని వెలికితీసి అభివృద్ధి పరచి పునరుద్ధరిస్తారు.

2. ఆడియో ప్రామాణికతను, వీడియో ప్రామాణికతను టేప్‌ లోని ఇమేజ్‌ల ప్రామాణికతను నిర్ధారిస్తారు.

3. టేపులోని బ్యాక్‌గ్రౌండ్‌లో రికార్డయిన శబ్దాలని తీసి అసలు శబ్దాల నాణ్యతను పెంచి వినబడేలా చేయడం, గొంతును గుర్తించడం, ఆడియోను / వీడియోను మెరుగుపరచడం ఆ టేపును ధృవీకరించటం వంటి ప్రక్రియలతో దర్యాప్తునకు సహాయపడతాడు.

4. ఆడియో లేదా వీడియో రికార్డింగు మార్చినా, ఎడిట్‌ చేయబడినా, లేదా పునరావృతం చేసినా కనుగొంటారు.

5. రికార్డింగు టేప్‌లోని వ్యక్తులను లేదా వస్తువులను గుర్తిస్తారు.

6. రికార్డింగులోని సాంకేతిక సమాచారం సహాయంతో ఆడియో లేదా వీడియో సవరణలను (ఎడిటింగ్‌లను) గుర్తిస్తారు.

7. వీడియో టేపులో రికార్డు అయిన దృశ్యాల వరుసను పరీక్షించడం మరియు దానిలో రికార్డు అయిన చిత్రాల నాణ్యతను పెంచటం చేస్తారు.

8. వీడియోలోని రికార్డింగు ఒకేసారి చేసిందా లేదా వివిధ సంఘటనలను ఒకటిగా కలిపి చేశారా? అన్న ప్రశ్నలకు సమాధానం ఇస్తారు.

9. రికార్డింగులోని వ్యక్తులు ఫలానివారు అవునా? కాదా? అని దర్యాప్తు అధికారి పంపిన స్టాండర్డ్సుతో సరిపోల్చి నిర్ధారిస్తారు.

10. వీడియోలోని ఫొటో గ్రాఫిక్‌ ఇమేజ్‌ ఫ్రేమ్‌తీసుకొని పునరుద్ధరించి నాణ్యతను పెంచుతారు.

11. వీడియో రికార్డింగులోని ఏ ఫ్రేమునైనా ఎడిట్‌ చేశారా? ఏదైనా కొత్త రికార్డింగును చొప్పించారా? ఏ ఫ్రేమునైనా తీసేశారా? అన్న వివిధ ప్రశ్నలకు సమాధానం చెబుతారు.

12. రికార్డు అయిన సాక్ష్యాలలో దర్యాప్తు అధికారికి ఏవైనా అనుమానాలుంటే వాటికి ఫోరెన్సిక్‌ భౌతిక శాస్త్ర విభాగంలోని నిపుణులు, దర్యాప్తు అధికారి అడిగిన  నిర్దిష్ట ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు.

వీడియో ప్రామాణికతను నిర్ధారించే పద్ధతులు:

1. దృశ్య పరిశీలన (విజువల్‌ అబ్జర్వేషన్‌): సీడీలో లేదా టేప్‌లో ఉన్న రికార్డింగులను సీన్‌బై సీన్‌ పరిశీలించి, దానిలోని బ్యాక్‌గ్రౌండ్‌, మచ్చలు, నిలువు లేదా అడ్డగీతలు, రంగుల్లో తేడాలు, బ్యాక్‌గ్రౌండ్‌ శబ్దాలలో తేడాలు, ఇతర శబ్దాలలో తేడాలు మొదలైన వాటిని శాస్త్రీయంగా పరిశీలించి నిపుణులు తమ నివేదికను ఇస్తారు.

2. తరంగ రూప పరీక్షలు (ఎగ్జామినేషన్‌ అండర్‌ వేవ్‌ఫామ్‌ మానిటర్‌):  ఒక ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను కలిగిన కంప్యూటర్‌ సిస్టంలో ఈ వీడియో క్యాసెట్‌ను లేదా సీడి రికార్డింగును పరిశీలించినపుడు  తరంగ రూపంలో దృశ్య సంకేతాలు కంప్యూటర్‌ మానిటర్‌పై దర్శనమిస్తాయి.  ఈ సంకేతాలు వోల్టేజ్‌ మరియు సమయం ఆధారంగా ఏర్పడతాయి.

ఏమైనా ఎడిటింగ్‌ వంటివి చేస్తే సంకేతాల స్థానంలో మార్పులు (సిగ్నల్‌ అబెరేషన్‌) సంభవించి అవి కంప్యూటర్‌ మానిటర్‌ మీద దర్శనమిస్తాయి. ఎక్కడ నుంచి ఎక్కడవరకు ఎడిట్‌ చేసి ఉందో ఈ సంకేతాల ద్వారా గుర్తించవచ్చును. వీడియో సంకేతాలలోని కాంతిమత్తత (ల్యూమినెేసెన్స్‌) విలువలను అధ్యయనం చేయటం ద్వారా ఎడిట్‌ చేసిన స్థానాలను గుర్తిస్తారు. ఈ పద్ధతులే కాక వెక్టర్‌ స్కోప్‌, డాజిల్‌, వర్చువల్‌ ల్యాబ్‌ మొదలైన అధునాతన కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి అవిఎడిట్‌ చేయబడినవా? లేదా?అని వివిధ పరీక్షలు నిర్వహించి నిర్ధారిస్తారు. ఆడియో మరియు వీడియోలను పరిశీలించి పెదవుల కదలిక మాటలకు అనుసంధానంగా ఉందా? లేదా? అన్నవిషయాలు పరిశీలిస్తారు. అవసరమైతే దేంతో అయితే ఆ వీడియోను రికార్డు చేశారో, దాంతో మరలా రికార్డు చేసి కలర్‌లో ఏవైనా మార్పులు ఉన్నాయా? లేదా? అని పరిశీలిస్తారు.

ఆడియో-వీడియో సాక్ష్యాధారాల సేకరణలో జాగ్రత్తలు:

1. ఈ కెమెరాలు, ప్లేయర్లు సరిగ్గా పనిచేస్తున్నాయా? లేదా? వాటి సీరియల్‌ నంబరు? మొదలైన విషయాలు తెలుసుకోవటానికి దర్యాప్తు అధికారి వాటిపై ఫింగర్‌ ప్రింట్లు, సూక్ష్మ ఆధారాలు వంటివి సేకరించిన  తర్వాతనే ఈ పరీక్షలకు పంపాలి.

2. చేతులకు గ్లౌజులు తొడిగిన తర్వాతే ఈ ఆధారాలను సేకరించాలి. 

3. వీడియో టేపులు, ఆడియో టేపులు లేదా వీడియో కెమెరాల వంటి సాక్ష్యాలకు ఎటువంటి స్వయం పరీక్షలు చేయకూడదు.

4. కెమెరాలు / టేపుల వంటి రికార్డింగ్‌ పరికరాల మీద ఫింగర్‌ ప్రింట్లు, వెంట్రుకలు, లేదా రక్తం వంటి ఇతర ఆధారాలు ఉన్నట్లయితే ఆ పరికరాలు ఏ మాత్రం దెబ్బతినకుండా జాగ్రత్త  వహించి సేకరించాలి.

5. క్వశ్చన్డ్‌ రికార్డుల్లోని అవసరంలేని సన్నివేశాలను, రికార్డ్డింగులను తొలగించకూడదు.

6. కెమెరాలు/టేపులు/సీడీలు/సెల్‌ఫోన్‌ల మీద అది క్వశ్చన్డా? లేక స్పెసిమన్‌ రికార్డింగో తెలుపుతూ లేబుల్‌ చేసి దాని ప్లాస్టిక్‌ ఉపరితలం మీద, ఒక మూలన గుర్తింపు కొరకు  దర్యాప్తు అధికారి మార్కర్‌ పెన్నుతో సంతకం చేయాలి.

7. వీడియో టేపులను పేపర్‌ కవర్లలో మాత్రమే ప్యాక్‌ చేయాలి. ప్లాస్టిక్‌ కవర్లలో అసలు ప్యాక్‌ చేయరాదు.

8. క్వశ్చన్డ్‌ మరియు స్పెసిమన్‌ రికార్డింగులను విడివిడిగా ప్యాక్‌ చేయాలి.

9. వీడియో టేపులు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపేవరకు గది ఉష్ణోగ్రతలోనే  ఉండాలి. వీటికి అధిక ఉష్ణం, తేమ వంటి వాటికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

10. ఈ టేపులు, సీడీల సాక్ష్యాలను 'మ్యాగైట్స్‌'కు దూరంగా ఉంచాలి.

11.  'చైన్‌ ఆఫ్‌ కస్టడి'ని తప్పకుండా పాటించాలి.

12. పేపర్‌ కవర్లను జాగ్రత్తగా సీలుచేసి దర్యాప్తు అధికారి తమ సొంత సీలును దానిపై వేయాలి.

13. కవర్ల లోపల బయట ఇన్‌వర్డ్‌ లేబుల్స్‌ మరియు అవుట్‌వర్డ్‌ లేబుల్స్‌ తప్పకుండా ఉండాలి. వాటిపై క్రైం నంబరు, సెక్షన్‌, పోలీస్‌స్టేషన్‌, తేదీ, పంచుల సంతకాలు, దర్యాప్తు అధికారి సంతకాన్ని తప్పకుండా పొందుపరచాలి.

14. కెమెరాలు/రికార్డింగ్‌ పరికరాలతోపాటు వాటికి సంబంధించిన చార్జింగ్‌ వైర్లు, యూఎస్‌బి కేబుల్స్‌ మొదలగునవి కూడా పంపాలి.

15. వీడియో కెమెరాలను అట్ట బాక్సుల్లో లేదా కవర్లలో ప్యాక్‌ చేసినప్పుడు బయట దానిని గట్టి దారంతో లేదా పురికొసతో గట్టిగా కట్టి సీలు వేయాలి.

16. ప్యాకింగ్‌లో పై విషయాలే కాక రవాణా విషయంలో కూడా ఎంతో జాగ్రత్త వహించి సాక్ష్యాధారాలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపాలి. 

వార్తావాహిని