యూనిట్

దాపుడు కోక

''అయ్యో, నాయనా! నాకోక! దాపుడు కోక!'' పద్దెనిమిదేళ్ళ పల్లెటూరు చెన్నమ్మసీట్లోంచి దిగ్గున లేస్తూ అరిచింది. వుట్టిపాటుగా ఆవేశంగా, ఆందోళనతో అరిచింది. చెన్నమ్మ అందమైంది కాదు. కాబట్టి దిగ్గున లేవడంతో హొయలు లేవు. వొళ్ళో పైట మరుగున పాలు తాగుతూన్న పసివాడు తల్లి వుట్టిపాటు కదిరిపడి కెవ్వుమన్నాడు. పైట జారిపోయింది. వీడిపోయిన రవికలోంచి, పసివాడి నోట్లోంచి తప్పిపోయిన రొమ్ములు కన్పిస్తున్నాయి. వొళ్ళోంచీ జారిపోతూ కెవ్వుమంటూన్న బిడ్డను సందిట్లోకి యెగదోసుకుంది.

''నాయనా! నా కోక! దాపుడు కోక!''

చెన్నమ్మ జాలిగా ఆర్తనాదం చేసింది. చెన్నమ్మ నాగరిక నాయిక కాదు కాబట్టి ఆమె ఆర్తనాదంలో విపంచీ కలస్వనాలు పలకలేదు. బస్సు యింజను రొదలో ప్రయాణీకుల రణగొణధ్వనుల్లో, చెన్నమ్మ గోడు యెవరికీ అర్థం కాలేదు. కాని చెన్నమ్మ వులికిపాటు చూచి కొందరు గొల్లుమన్నారు. చెన్నమ్మ తీరుతెన్నుల్లో కొందరు సెక్సును చూస్తున్నారు. కండక్టరు ద్రోణుడు సృష్టించిన పద్మవ్యూహంలో చిక్కుకొని వొక మూల నలిగిపోతున్న వీరయ్య, ఆ అరిచింది తన కూతురని గుర్తించాడు. యేమరుస్తున్నదో సరిగా వినిపించకపోయినా, యెందుకరస్తున్నదో అర్థం కాకపోయినా యేదో జరిగిందనుకున్నాడు. పద్మవ్యూహాన్ని చేధించుకొని ఆడవాళ్ల సీట్లవైపు రావడానికి ఘోర ప్రయత్నం చేస్తున్నాడు వీరయ్య. తన చుట్టూ నిలబడివున్న వాళ్ళ తలలమధ్య నుంచీ నిక్కి చూస్తూ ''యేంటమ్మా, యేం జరిగింది?'' అన్నాడు. చెన్నమ్మకు వాళ్ళ నాయన ప్రశ్న వినిపించింది. నవ్వుతూన్న ప్రయాణీకులనూ, తనకేసి చూస్తున్న రసికులనూ చెన్నమ్మ చూసింది. యేడుపు దిగమింగుకుంటూ అవమాన భారంతో పైటలాక్కుంటూ అంది.

''మనం యింతకు ముందు దిగిన్నామే, ఆ బస్సులో నా గుడ్డల మూటె - దాపుడుకోకున్న మూటె మర్చిపోయినా''.

టికెట్లు వసూలు చేసుకుంటూ, బస్సులోని జనాన్ని సర్దుతూ ఆడవాళ్ళనూ మొరటు వాళ్ళను అదమాయిస్తూ అష్టావధానం చేస్తున్న కండక్టర్‌ చెన్నమ్మ అరుపులకు మండి పడ్డాడు. 'కూచో' అని కసిరాడు. అంతలో తంటాలు పడి అక్కడికి చీవాట్ల మధ్య వీరయ్య యీదుకుంటూ వచ్చాడు - గొర్రె పిల్లను రక్షించడానికి వచ్చిన గొర్ల కాపరిలాగా, వీరయ్యకు సంగతి అర్థమైంది. కండక్టరును బస్సు ఆపమన్నాడు. కండక్టరు కస్సుమని వొంటికాలి మీద లేచాడు.

''యేందయ్యా మీ గోల. వూరుదాటి మైలొచ్చేసినాం, బస్సు నిలపడమేంటి? ఆ మూటేదో తెచ్చుకునేదాకా బస్సాపమంటావా? నీ పుణ్యాన వెనక్కి పోనిమ్మంట్లేదు. నీకోసం బస్సు నిలబెట్టాల్నా? నువ్వేం డీయస్పీవా? బ్రేకినిస్పెక్టరువా?''

కండక్టరు నిజం పలికినందుకు వీరయ్య విస్తుపోయాడు. వీరయ్య డీయస్పీ కాదు: బ్రేకినిస్పెక్టరు అంతకన్నా కాదు, బస్సునూ, కండక్టరునూ చేసేదేం లేక కూతురును కసిరాడు.

''ఆ మాత్తరం జాగర్త అక్కర్లా? ఆ మూటెను యాడమర్చిపోయినావు? ఆ మూటెలో యేమున్నాయి?''

''మానూర్నుంచి వచ్చిన బస్సులో మర్చిపోయినా, అంతగుంపు దోసుకొస్తుంటే దిక్కుతెల్లేదు నాయనా? వూపిరాడక పిల్లోడు యేడ్చినాడు. తొందరగా దిగడంలో మర్చిపోయినా. దిగి మళ్ళా ఆ బస్సులో యెదికితే దొరుకుతాదేమో?''

తండ్రివైపూ, కండక్టరు వైపూ దీనాతిదీనంగా చూస్తూ, చుట్టూ వున్న వాళ్ళను సిగ్గుతో చూస్తూ చెన్నమ్మ సంజాయిషీ చెప్పింది.

'' యే బస్సులో యేం?'' కండక్టరు కరిచాడు.

'' కడబస్సులో'' చెన్నమ్మ బెరుకుగా సమాధానమిచ్చింది.

''పెద్ద పెద్దయి మర్చిపోయినోళ్ళతో కూడా మా కిబ్బంది లేదు. మీరు మా దుంపదెంచుతారు - నానా రకాల మూటల్తోవచ్చి''.

తనేమిటో మర్చిపోయి కండక్టరు విసుక్కున్నాడు. కండక్టరు విసుక్కోకపోవడానికి చెన్నమ్మ ఖరీదైనది కాదు. సానుభూతితో పరామర్శించడానికి చెన్నమ్మ అందమైనది కాదు. మర్యాదగా మాట్టాడానికి చెన్నమ్మ బస్సు వోనర్లతో సంబంధముండే యే అధికారి భార్య కాదు, బంధువూ కాదు. బస్సులోని వారెవరో సానుభూతి ప్రకటించారు.

''పోనీలో పాపం, బస్సు నిలబెట్టు, వాళ్ళు దిగుతారు. మూటె దొరుకుతుందేమో, అది నైటాల్టు బస్సే కదా? అక్కడే వుంటుంది''.

వీరయ్య కొంతధైర్యం తెచ్చుకొని బ్రతిమాలాడు.

''నీకు పుణ్ణెముంటుంది. మా టికెట్టు డబ్బులు వెనక్కి యిచ్చి యిక్కడ దించు. మూటె దొరికితే యేరే బస్సులో వస్తాం''.

'నీకెమన్నా మతిబోయిందా? టికెట్టు రాసినాం. బస్సు వూరు దాటి రెండు మైళ్లొంచ్చింది. యిప్పుడు టికెట్టు డబ్బులడుగుతావా? యింకా పొద్దుటూరు చేరినాక అడగలా? నీదేం బోయింది? యిట్లా అయితే మేమూ, మా వోనరూ దివాలా తీయాల్సిందే''.

కండక్టరు స్వామి భక్తిని ప్రకటించాడు.

వీరయ్య ప్రాధేయపడ్డాడు.

''మళ్ళా రావటానికి డబ్బుల్లేవు. నీకు పున్నెముంటుంది. యిక్కడే దించి డబ్బులీ, దిగిపోతాం బాబ్బాబూ''.

''డబ్బుల్లేవు, డబ్బుల్లేవు, యిదొక తంతయింది. నీకేం మా చెకింగు పట్టుకున్నాడంటె నా వుద్యోగం వూడ్తుంది. డబ్బు వాపసేమీ రాదు, కావాలంటే దిగండి''.

కండక్టరు చీదరించాడు. వీరయ్య కూతురు వైపు నిస్సహాయంగా చూస్తూ అన్నాడు. ''దిగితే మళ్లా సార్జీలకు లేదు. పోతే పోనీలే మన కరమ''.

'' నా దగ్గర మూడు రూపాయలుంది. సార్జీకి సరిపోతాది. దిగుదాం'', చెన్నమ్మ కండక్టరు వైపు భయంతో చూస్తూ అంది.

కండక్టరు ''దరిద్రపు రూట''ని వదురుకుంటూ ''హోల్డాన్‌'' అని కేక వేశాడు. బస్సు ఆగింది. వీరయ్యా, చెన్నమ్మ దిగారు. చంకలోంచి జారిపోతున్న కొడుకును పైకి లాక్కుంటూ త్వరత్వరగా అడుగులు వేస్తూంది చెన్నమ్మ. వీరయ్య దిగులుగా అనుసరిస్తున్నాడు.

నాకోక

దాపుడు కోక

ముప్పయి రూపాయల కోక

పేటలో కొనుక్కున్న కోక

కలుపు తీయటానికి పోయి

నిమ్మసెట్లలో పాదులు తొవ్వటానికి పోయి

కట్టపడి డబ్బు కూడబెట్టుకొని

కొనుక్కున్న కోక

తనకెంతో యిష్టమైన కోక

అరచేతి యెడల్పు నల్లంచు యెర్రకోక

మొగుడికి సానా యిష్టమైన కోక

యీకోక కట్టుకుంటే సినిమాల్లో సావిత్రిల్లా వుంటావని మొగుడంటే

రోజూ కట్టుకో బుద్దయ్యే కోక కానీ

వుతకలకు కట్టుకుంటే సిరిగిపోతుందని భయపడి

రోజూ కట్టుకోని కోక

పిల్లోడు పుట్నెప్పున్నించీ కట్టుకోని కోక

పిల్లోన్ని సంకలో యేసుకున్నప్పుడు వాడుచ్చలు పోస్తే పాడయిపోతాదని

కట్టుకోని కోక నలుగురూ మెచ్చుకున్న కోక

తన దాపుడు కోక

కరమ యెవడన్నా యెత్తకపోయినాడేమో!

పుట్టింట్లో అందరికీ సూపియ్యాలనుకున్నానే

తిరిగి వూరికి పోయినప్పుడు మొగుడేమంటాడో!

పుట్టింట్లో సెల్లెలికిచ్చి వచ్చినావని అరుస్తాడేమో!

ఆ కోక లేకపోతే

సినిమాకు పోయెదెట్లా?

పండగల కెట్లా?

రామేశ్వరం తిర్నాలకెట్లా?

పెండ్లిండ్లకెట్లా?

నలుగుర్లో తిరిగేదెట్లా?

మళ్ళా కొత్తది కొనేదెట్లా?

ముప్పయి రూపాయల కట్టం

సీరెకోసం కట్టంలో

నిమ్మసెట్ల పాదులు తొలికెతో తోగితోగి

సేతులు కాయలు కాసినాయి.

చెన్నమ్మ మనస్సు బాధతో నిండిపోయింది. దు:ఖం ముంచుకొచ్చింది. కళ్ళల్లో నీళ్ళు. కష్టం తెలిసిన కన్నీళ్ళు, పేదకోరిక కారుస్తున్న కన్నీళ్ళు.

''సోమీ! యేడుకొండలవాడా! నా దాపుడు కోక దొరికితే వొక్క పొద్దుండి టెంకాయ కొడతా'' అని చెన్నమ్మ మనసులో పరిపరి విధాల మొక్కుకుంది. వీరాయ్య, చెన్నమ్మా స్టాండు చేరారు.

''నాయనా! అదే బస్సు, మనం వూర్నించి వచ్చిన యెర్ర మూతి బస్సు''.

చెన్నమ్మ కోక దొరికినంత ఆనందమయింది.

''పిల్లోంతో నువ్వేం బాధపడతావు గాని, అదిగో అక్కడుండు, నేను యెదికి తెస్తా''.

వీరయ్య చెన్నమ్మను వొక బంకు నీడలో వొక పక్కగా నిలబెట్టి బస్సు దగ్గరకు వెళ్లాడు. బస్సంతా వెతికాడు - సీటు సీటుపైనా కిందా కన్పడలేదు. బస్సులో చెత్త వూడుస్తున్న కుర్రవాణ్ణి అడిగితే ''అట్లాంటి మూటె కనపళ్లేద''న్నాడు. బస్సు దగ్గర వున్న వొకరిద్దర్ని అడిగినా ప్రయోజనం లేక పోయింది. డ్రెవరునూ, కండక్టరునూ అడుగుదామనుకున్నాడు. కానీ డ్రైవరు యింటికి పోయినాడట, కండక్టరు కలెక్షను డబ్బులు వోనరు కివ్వటానికి పోయినాడట - బస్సు క్లీనరు చెప్పాడు. వీరయ్య హతాశుడై తిరిగివచ్చి కూతురును వోదార్చటానికి ప్రయత్నిస్తూ వేదాంతం చెప్పాడు.

''దొరకలా, యెంతెతికినా దొరకలా, యాడెతికినా దొరకలా, యెవర్నడిగినా దొరకలా, పొద్దున్నే యెవల్ల మొకం చూసి బయల్దేరినామో, మన కరమ, యేం సేస్తాం? యెవడో యెత్తకపోయినాడు- మనకంటే దరిద్దరం ముండా కొడుకు. అయినా మనలాంటోల్లు జాగర్తగా వుండాల, యేందన్నా పోగొట్టుకుంటే  తిరిగి సంపాయించుకునే గతిలేదు. పోతేపోనీలే. వూరికి పోయినాక చూస్తాం''.

బస్సులో పడిన అవమానాన్ని తలచుకుంటూ, నడిచి వచ్చిన శ్రమను అనుభవిస్తూ, మరొక చీర - అట్లాంటి చీర - కొనలేని దరిద్రాన్ని తలపోసుకుంటూ, అల్లుడేమనుకోకుండా అట్లాంటిదే మరొక చీరను కొని కూతురుకిచ్చే వుపాయాన్ని ఆలోచిస్తూ వీరయ్య కూతురును వోదారుస్తున్నాడు. అంతలో వాళ్ళకు కొంచెం దూరంలో వొక తాగిన వాడు బండబూతులు తిడుతూ తూలుకుంటూ పరుగెత్తుకొస్తున్నాడు. వాడిచేతిలో యేదో యెర్రటి బట్ట. వానివెంట మరొకడు తరుముతూ వస్తున్నాడు.

''వొరే యెదవ నాకొడకా, యాడకు బోతావురా, గొంతుదాకా వుద్దర సారాయి తాగదమనుకున్నావా?''

సారాయి తాగినవాడి చేతిలో వున్న వస్తువును, లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు, సారాయి తాగినవాడు గట్టిగా పట్టుకున్నా, కొంత సడలి బట్ట అంచులు జారినాయి.

''నాయనా! అదిగో నాకోక, నాదే ఆ కోక, అదే నా దాపుడు కోక'.

చెన్నమ్మ తండ్రితో బిగ్గరగా చెప్పి వాళ్ళ దగ్గరకు ఆదుర్దాతో పరుగెత్తుతోంది. వీరయ్య గాబరా పడుతూ వాళ్ళ దగ్గరకు చేరాడు.

వాళ్లింగా పెనుగులాడుతూనే వున్నారు. వొకరిద్దరు పోగయ్యారు. సారాయి తాగిన వానితో పెనుగులాడుతున్నవాడంటున్నాడు.

''రేయి నా దగ్గర టోకరా యేస్తావా? తాకట్టు పెట్టినట్టు పెట్టి పనికి రానివన్నీ నా మీదేసీ యీ కోక లాక్కొని పోతావా - నదురుగా వుందని, తాగిన పద్దరాముల సారాయైనా కక్కు, లేదా యీ కోక నాకివ్వు. కోక యీరా దొంగనాకొడక''.

''నా కోక, నాదే దాపుడు కోక, మిగతా పిల్లోడి గుడ్డలూ అయ్యియ్యాడ్నో?'' చెన్నమ్మ దీనంగా గొణుగుతూంది.

వీరయ్యా వాళ్ళ దగ్గరకు భయం భయంగా వెళ్ళి అన్నాడు.

'' యీ కోక మాయమ్మిది, బస్సులో మరిసిపోయింది''.

''అదే నేననుకుంటాండ, యీ నాకొడుక్కి కోకెక్కడిదీ అని. బస్సులో కొట్టేసినాడన్న మాట! వొరేయి యిడవరా కోక''.

సారాయి తాగిన వాడు నంగి నంగిగా అన్నాడు?.

''ర్రేయి నా సంగతి తెలీదా, యిడు, యిది నా కోక, నా పెండ్లాందిరా''.

యిద్దరు గట్టిగా పెనుగులాడుతున్నారు. అరుపులు, తిట్లతో. వీరయ్య చీరను విడిపించడానికి తానూ ప్రయత్నించాడు. పెనుగులాటలో చీర పర్రున చిరిగింది. చెన్నమ్మ యెర్రకోక, నల్లంచు యెర్ర దాపుడు కోక చిరిగి పీలికలైంది. రభస యింకా యెక్కువైంది. వాళ్ళు కొట్టుకుంటున్నారు. వీరయ్య చిరిగిన చీరవంక నిశ్చేష్ఠుడై చూస్తున్నాడు.

చెన్నమ్మ కలలకూ, ఆశలకూ, ప్రేమకూ, గర్వానికీ, ఆనందానికీ నిలయమైన దాపుడు కోకను, చెన్నమ్మ గుండెకు ప్రతిరూపమైన యెర్రకోకను, వాళ్ళది కాని చెన్నమ్మ కోకను వాళ్ళు నిర్ధాక్షిణ్యంగా చించిపారవేశారు. చెన్నమ్మ దాపుడు కోక పీలికలైంది.

''నా కోక, దాపుడు కోక''.

చెన్నమ్మ కిందపడిన పీలికల్ని పట్టుకొని రోదిస్తోంది. చంకలో పసివాడు అమ్మ వెక్కిళ్ళకు శృతి పెడుతున్నాడు.

డాక్టర్‌ కేతు విశ్వనాథరెడ్డి

అధ్యాపకుడిగా వృత్తిని కొన సాగించినా ప్రవృత్తి అయిన సాహిత్యంలో ఆరు కథా సంపుటాలు, నాలుగు నవ లలు, ఐదు వ్యాసాల సంపుటాలు వెలు వరించి ఎన్నో పుస్తకాల ప్రచురణకు సంపా దకులుగా వ్యవహరించారు. 'కథ   ఉనికిని సామాజిక ప్రయోజనానికి నిబద్దం చేసిన' అభ్యుదయ రచయిత కేతు విశ్వ నాథరెడ్డి గారు. కొడవగంటి కుటుంబరావు గారి రచనలను 14 సంపుటాలుగా సమీకరించి, సంపాదకత్వం వహించారు. 1996లో 'కేతు విశ్వనాథరెడ్డి కథలు' సంపుటానికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. భారతీయ భాషా పరిషత్తు, కలకత్తా (1994), తెలుగు విశ్వవిద్యాలయం (93-94) పురస్కారాలు పొందారు. అరసం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. ఈ కథానికను తనకు నచ్చిన కథానికగా కూడా విశ్వనాథరెడ్డి పేర్కొన్నారు.

సంకలనం: పెనుగొండ

వార్తావాహిని