యూనిట్

పిల్లి బుర్ర

ఒక పెద్దాయన దగ్గర ఒక పెద్ద పిల్లి వుండేది. దానికి అసలు ఎలుకల్ని పట్టే ఓపిక లేదు, వయసు మీద పడింది కదా! ఆ పెద్దాయన పిల్లితో విసిగిపోయాడు. దాంతో ఓ రోజు పిల్లిని అడవిలో వదిలేసి వచ్చాడు. ఒంటరిగా దిగులుగా వున్న పిల్లిని ఒక నక్క చూసింది. ‘‘ఎందుకు ఏడుస్తున్నావు?’’ అనడిగింది, పిల్లి చెప్పింది. ‘‘నాకూ వయసు మళ్ళింది - కానీ దిగులు పడితే ఏం ప్రయోజనం - ధైర్యంగా వుండు’’ అన్నది నక్క. ‘‘ఐతే నీతో కలిసి వుంటా - ఇద్దరం కలిసి వేటాడి బతుకుదాం’’ అంది పిల్లి. నక్క సరేనంది. ఒక రోజు ఒక తోడేలు, అడివి పంది, ఎలుగుబంటి, ముసలి పిల్లిని చూశాయి. ఎలాగయినా దాన్ని ఇంటినుంచీ బయటకు రప్పించి తినేద్దామనుకున్నాయి. కానీ ముసిలి నక్క మాత్రం ఈ మూడిటికి స్నేహితుడు. అందుకే దొంగతనంగా పిల్లిని కాజెయ్యాలని సమావేశం అయ్యాయి. అదీ నక్కకు తెలీకుండా. తోడేలు, పంది, ఎలుగుబంటీ ఉపాయం పన్నాయి. నక్క దగ్గరకెళ్ళి పిల్లిని తమ ఇళ్ళకి పంపమని, ఇంట్లో తమ కుటుంబాలు పిల్లికి విందు ఇవ్వాలను కుంటున్నాయని చెప్పి నమ్మిద్దామనుకున్నాయి. ఐతే నక్క వీటి ఉద్దేశం ముందే పసిగట్టి పొదల చాటున దాక్కున్నది. వాళ్ళు రహస్యంగా మాట్లాడుకున్న ఉపాయం పూర్తిగా విన్నది. వెంటనే పరుగు పరుగున ఇంటికి వెళ్ళి పిల్లికి జరిగిందంతా చెప్పింది. సరే - వీళ్ళకి మించిన ఉపాయం పన్నుదామనుకున్నాయి నక్క పిల్లి. మరునాడు సాయంత్రం పంది, తోడేలు, ఎలుగుబంటీ నక్క ఇంటికి వచ్చాయి. నక్క ఎదురు వచ్చి వాటిని ఇంటిలోకి పిలిచింది. ‘‘పిల్లి స్నానం చేస్తోంది. ఈ లోగా మీకు ఒక ముఖ్యమైన సంగతి చెప్పాలి’’ అన్నది. ‘‘ఏంటి?’’ అని అవి అడిగాయి. ‘‘మరేం లేదు పిల్లి గారు మీకు ఇవాళ మంచి విందు ఇద్దామనుకుంది. మంచి మాంసం వంట చేస్తుంది’’ అన్నది నక్క. ‘‘ఓహో! అలాగా?! ఐనా పిల్లి ఒక్కటీ మనందరికీ ఎలా వంట చేయగలదూ?’’ అని ఎలుగుబంటి అడిగింది. ‘‘పిల్లి గారి సంగతి మీకు తెలీదు. ముసలిదైనా చాలా బలవంతురాలు - తోకతో నదిలోని చేపల్ని పట్టగలదు - కాలి గోళ్ళతో పెద్ద ఎలుగుబంటిని చీరెయ్యగలదు. నోటితో మొసలితోకని కొరికెయ్యగలదు - అలాంటిది మన నలుగురికి వంట చేయలేదా!’’ అన్నది నక్క. తోడేలుకు భయం పట్టుకుంది. ఇంత బలమైన దాన్ని మనం ఏం చేయగలం? అని, మిగతా వాటికీ అదే భయం పట్టుకుంది. ‘‘సరే ముగ్గురం వున్నాం గదా చూద్దాం’’ అనుకున్నాయి మనసులో. ఎలుగుబంటి, తోడేలు, పందీ కలిసి నక్క లోపలి గదిలోకి వెళ్ళగానే చెవిలో రహస్యం చెప్పుకున్నాయి. బాగా తినేసి నిద్ర నటిద్దాం. నక్క నిద్రపోగానే పిల్లిని ముగ్గురం కలిసి ఎత్తుకుపోదాం - ముగ్గురం వున్నాం గదా - అని అనుకున్నాయి. ఈలోగా లోపలి గదిలో నక్క, పిల్లి రహస్యం మాట్లాడుకున్నాయి. ‘‘భోజనం చేసేకా అవి నిద్రపోగానే ఇద్దరం జాగ్రత్తగా పారిపోయి దూరంగా వెళ్ళి బతుకుదాం’’ అనుకున్నాయి. పిల్లి వంటకం తిన్నాయి అన్నీ. ఉపాయం ప్రకారం అన్ని నిద్ర వస్తోంది. కాసేపు నిద్రపోయి లేద్దాం అనుకుని అన్ని నిద్ర నటించాయి. ఐతే ముందుగా నక్కలేచి బయటికి వెళ్లి గుబుర్లలో దాక్కుంది. పిల్లి మెల్లిగా లేచి ఇంటి బయటికి గెంతుదామనుకుంది. బయటి గుమ్మం దాకా ఎగరలేక పోయింది. కానీ కాలు జారి పంది తోక మీద పడి దాని గోళ్లు గుచ్చుకున్నాయి. హడలిపోయిన పంది భయంతో ఎగిరి తోడేలు మీద పడటంతో దాని నడుం విరిగినంత పనయింది. అది ఇంకా భయంతో ఎగిరి ఎలుగుబంటి మీద పడటంతో దాని పళ్లు ఎలుగుబంటి చెవులని చేరేసేయి - మూడు ఇదంతా పిల్లి వల్లే జరిగిందనుకున్నాయి. ‘‘ఓరి నాయనాయ్‍, ఈ పిల్లి ఎంత బలమైందిరా బాబోయ్‍’’ అనుకున్నాయి. పైగా పిల్లి భయంతో పెద్దగా మ్యావ్‍ అనటంతో తమని కొరికింది గాక నమిలి తినేస్తుందేమోనని మూడు ఎగిరి దూకి ఇంటి బయటపడి, ఒళ్లు దులుపుకుని పారిపోయాయి. ఉపాయం మొత్తం మారిపోయినా సరే మంచే జరిగిందనుకున్నాయి. నక్క, పిల్లీ. ఇక మళ్ళీ ఎప్పుడూ తోడేలు, ఎలుగుబంటి, పందీ ఆ ప్రాంతానికి రాలేదు.

వార్తావాహిని