యూనిట్
Flash News
మరచిపోని సహాయం

ఒక ఉళ్ళో ఒకాయన దగ్గర ఒక
కుక్క వుండేది.అది పెద్దదయిపోయింది. అందుకని దీనితో ఏం ప్రయోజనం లేదనుకున్నాడు దాని యజమాని. అందుకని దాని తరిమేశాడు. పాపం
అది అక్కడా అక్కడా తిరిగింది. దానికి తిండి ఎవరు పెడతారు మరి?! ఊరి చివర అడవి దగ్గర ఒంటరిగా ఏడుస్తూ
కూచుంది. అప్పుడు అక్కడికొక తోడేలు వచ్చింది. ‘‘ఎందుకలా
ఏడుస్తున్నావ్’’ అనడిగింది. దానికి జరిగిందంతా చెప్పింది
కుక్క ‘‘ఒకరు పెడితే తినడం తప్ప వేరే దారి లేదు’’ అన్నది. ‘‘సరే నే చెప్పినట్టు చేస్తే మళ్ళీ నీ
యజమాని నిన్ను ఇంట్లోకి రానిస్తాడు. నీకు వున్న విశ్వాసం ఆయనకు లేదు - కానీ నే
చెప్పింది చేస్తే నీకే లాభం’’ అంది తోడేలు. సరే ఉపాయం
చెప్పమంది కుక్క. ‘‘రేపు పంట కోసే సమయం - ధాన్యం కోతలు
పని గదా - నీ యజమాని దూరంగా చేలగట్టు మీద పనిలో వుంటాడు. మీ యజమానురాలు తన బిడ్డని
గడ్డివాము దగ్గర పడుకోబెట్టి పంట కోతకి వెడుతుంది. నువ్వు గడ్డి వాము దగ్గర వుండు.
నేను బిడ్డను తీసుకుపోవడానికి వస్తాను. నువ్వు గట్టిగా అరువు. అది విని యజమాని,యజమానురాలు పరుగున వస్తారు. ఈ లోగా నన్ను కరిచినట్టు నటించు. నేను
బిడ్డను వదిలేసి పారిపోతాను. ఆ తరువాత చూడు ఏం జరుగుతోందో’’ అని ఉపాయం చెప్పింది తోడేలు. మర్నాడు అంతా అనుకున్నట్టే జరిగింది.
తోడేలు నుంచి బిడ్డని కాపాడినట్టు గట్టిగా పోట్లాడినట్టు నటించింది కుక్క. తోడేలు
పారిపోయింది. ఇలా బిడ్డని రక్షించినందుకు సమయానికి సహాయం చేసినందుకూ యజమానులు
కుక్కకి మంచి మాంసం పెట్టారు. ‘‘బిడ్డని కాపాడేవు ఇక
మాతోనే వుండు’’ అని కుక్కని ఇంటికి తీసుకుపోయారు. ఆ రోజు
నుంచీ రోజూ కుక్కకి కడుపు నిండా మంచి ఆహారం పెడుతూ దాన్ని బాగా చూసుకుంటున్నారు. ఆ
ఇంటి యజమానులు. కుక్కకి విశ్వాసం వుంది గనుక తోడేలుకు మంచి విందు ఇచ్చి ఉపకారానికి
బదులు తీర్చుకుందామనుకుంది. ఒక రోజు ఆ ఇంట్లో బిడ్డకి పుట్టినరోజు పండగ జరిగింది.
ఆరు బయట పెద్ద బల్లలు వేసి. వాటి మీద పెద్ద పెద్ద దుప్పట్లు పరిచారు. సాయంత్రం
అవుతుండగా కుక్క ఎవరికీ తెలియకుండా పొలంగట్టు దగ్గర తోడేలు కోసం చూసింది. దాని
గొంతుతో పిలిచింది. తోడేలు రాగానే దానికి మంచి విందు ఇస్తానని తనతో రమ్మనీ
చెప్పింది. జాగ్రత్తగా ఎవరూ చూడకుండా నక్కి నక్కి తోడేలు గడ్డి వాముల చాటుగా వచ్చి
దుప్పట్లు కప్పిన బల్ల కింద చూడకుండా దూరింది. బల్ల కింద కనపడే వీలు లేకుండా
దుప్పటి అంచుల కిందికి జారి వున్నాయి. కుక్క ఆ బల్ల బయట కాపలగా వుంది - మరో కుక్క,
పిల్లి, ఎలుకా వంటివి రాకుండా వేడి వేడి
మాంసాలు, ఇంకా కేక్‍లు, సవె•సాలు, వడలు గారెలు, ఇడ్లీలు,
కుడుములు, బజ్జీలు, ముక్కలుగా కోసిన టమాటో, కేరెట్, ఉల్లిపాయ, కీరా, ఆపిల్
- ఇలా ఎన్నో పళ్లాలు,గిన్నెలు పెట్టారు. బిరియానీ మామూలు
అన్నం, చపాతీలు, రొట్టెలు,
కుడా పెట్టారు. వేడి వేడి రసాలు, పాయసాలు
- అన్ని మంచి వాసనతో తోడేలు వొళ్లు మరిచిపోయింది. విందు మొదలు కాగానే యజమాని, యజమానురాలు కుక్కకి సంతోషంగా అన్ని బోలెడు పెడుతున్నారు. అవన్నీ
మెల్లిగా దుప్పటి వెనుక, బల్లకింద తోడేలు దగ్గరికి కాలుతో
తోస్తోంది కుక్క. తోడేలు హాయిగా వేడిగా అన్నీ ఆరగించింది. ఇంకా ఆ ఇంటి బంధువులు
కూడా కుక్కకి పడేసినవి. పళ్ళాల్లో మిగిలినవి కొంచెం తిని మిగతావి తోడేలుకి
ఇచ్చింది కుక్క. తోడేలు లొట్టలు వేసుకుంటూ తిన్నది. విందు అంతా అయిపోయే సమయానికి
తోడేలుకి నిద్ర మత్తు వచ్చేసి గట్టిగా ఆవులిస్తూ ‘‘గుర్
గుర్’’, ‘‘బ్రేవ్ బ్రేవ్’’
అన్నది తాను ఎక్కడున్నదో మరిచిపోయింది అది. కుక్క వెంటనే నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది. కానీ అక్కడ అందరికి అనుమానం
వచ్చింది.అందరూ కేకలు పెట్టేసరికి తోడేలు బయటకు వచ్చి పరిగైత్తింది. అందరూ కర్రలతో
వెంటపడబోయారు. కానీ ‘‘మనం వెంట
పడక్కల్లేదు. అగండి. మా కుక్క చాలు దానికి బుద్ధి చెప్పడానికి’’ అని యజమాని అన్నాడు. భలే అవకాశం కుదిరిందని తలచింది కుక్క. వెంటనే
తోడేలును తరుముతున్నట్టు వెంట పడింది. ఉపాయం అర్థమైన తోడేలు పరిగెత్తింది. ఊరి
చివరి పొలం దాకా వచ్చాకా ‘‘నువ్వు నాకు సాయం చేసేవు సహాయం
చేసిన వారిని మరిచిపోకూడదు. అందుకే నీకో సాయం చేశా’’ అని
కుక్క తోడేలుతో అన్నది. కుక్క తోడేలూ ఎవరి దారిన అవి వెళ్ళిపోయాయి.