యూనిట్
Flash News
మేలు

పూర్వం అవంతి అనే నగరం వుండేది. దానికి దూరంగా ఒక పెద్ద చెరువు వుంది. ఆ చెరువు నిండా నీళ్ళు, తామరపూలు, నీళ్ళలో చేపలూ-అన్నీ చాలా వున్నాయి. అందుకని అక్కడకి రకరకాల పక్షులొస్తాయి. వాటిలో హంసలు మరిన్ని వస్తాయి. ఆ సంగతి తెలిసి అక్కడికి ఒక వేటగాడు వస్తుంటాడు. పట్టిన పక్షుల్ని, వాటి గుడ్లనీ నగరానికి తెచ్చి అమ్ముతుంటాడు. ఆ చెరువుకు వచ్చి వాలే హంసలకు ఒక రాజు వున్నాడు. ఆ హంసకు ఒక రోజు వేటగాడు చెరువుగట్టు మీద కనిపించాడు. వెంటనే హంస అరవడంతో అక్కడ వాలిన హంసలన్ని ఎగిరిపోయాయి. వేటగాడు ఆలోచించి ఈ సారి నీటి మీదకు తామర ఆకుల కింద కనబడిన వల ఒకటి పరిచి వుంచాడు. ఈ సంగతి పసిగట్టిన రాజహంస మిత్రుడు వెళ్ళి ఇదంతా రాజహంసకు చెప్పాడు. కానీ రాజహంస మిగతా హంసలకు ధైర్యం చెప్పి రాజహంస చెరువు దగ్గరకు వెళ్ళింది. స్నేహితుడయిన హంసకు తామరాకుల మధ్య నీటి మీద తేలుతున్న వల కనిపించగానే గట్టిగా కేకలు పెట్టింది. అప్పుడు హంసలన్నీ ఎగిరిపోయాయి. కానీ అప్పటికే రాజహంస తన నోటికి చిక్కిన చేపతో సహా వలలో ఇరుక్కుపోయింది. ఎలాగూ వేటగాడు తనని పట్టుకుపోతాడు గనుక చేపనయినా రక్షించుదామని, తాను పట్టుకున్న చేపను నీళ్ళలోకి వదిలేసింది. అప్పుడు రాజహంస మిత్రుడు కూడా వచ్చి వలమీద నిలబడింది. కానీ ఉచ్చులో ఇరుక్కోలేదు. ‘‘నీవు ఎలాగూ వలలో ఇరుక్కోలేదు - నీవు వెళ్ళిపో. మంచి మాట, మంచి సలహా చెప్పినా నలుగురూ ఏం చేస్తారో అదే చేసి చిక్కుకున్నాను. నేను బయటపడలేను- కాబట్టి నువ్వు వెళ్ళిపో’’ అని రాజహంస అన్నది. ‘‘ఇన్నాళ్ళూ స్నేహంగా వున్నాం - నీకు కష్టం వచ్చినప్పుడు నేను పారిపోలేను. నీతో పాటే వుంటాను’’ అని అన్నది. ఈలోగా వేటగాడు వచ్చాడు. చూసి ఆశ్చర్యపడ్డాడు. వలలో చిక్కుకొనిన హంస తన స్నేహితుని కోసం అక్కడే నిలిచిపోవటం చూసి స్నేహం ఎంత మంచిదో గమనించాడు. ‘‘అయ్యా నన్ను కూడా ఈ రాజహంసతో పాటు తీసుకుపో. వండుకుని తింటావో, అమ్ముకుంటావో నీ యిష్టం’’ అన్నది రాజహంస స్నేహితుడు. వేటగాడు వల ఉచ్చు విడదీసి రెండు హంసలనీ వదిలేశాడు. మంచితనం, మంచి స్నేహం చూశాక నేనూ మంచితనం అంటే, స్నేహం అంటే ఏమిటో గ్రహించాను’’ అన్నాడు. సరే, నీ మంచితనాన్ని మేమూ మర్చిపోము అని ఎగిరి వెళ్ళిపోయాయి. వేటగాడు దొరికిన చేపలతో ఇంటికి వెళ్ళాడు. మర్నాడు వేటగాడు వేటకి బయలుదేరే సమయానికి రెండు హంసలూ వాటికి ఎక్కడెక్కడో దొరికిన విలువైన చిన్న వజ్రాలు, ముత్యాలు తెచ్చి అతని ముందు పడవేశాయి. ఒక రెండు పెద్ద చేపలను కూడా తెచ్చి ఇచ్చాయి. స్నేహం అంటే ఏమిటో, చేసిన మేలును గుర్తుపెట్టుకోవటం అంటే ఏమిటో వేటగానికి అర్థమైంది.