యూనిట్
Flash News
పోలీసులకు వారాంతపు సెలవు - ఒక మంచి పరిణామం

మేము దాదాపు రెండు దశాబ్దాలుగా పోలీస్ శాఖతో కలిసి పని చేస్తున్నాము. మహిళా పోలీస్ స్టేషన్లలో సపోర్ట్ సెంటర్లు ఏర్పాటుచేయడం, పోలీస్ శాఖలో పనిచేసే సిబ్బందికి ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ విభాగంలో పనిచేసే సిబ్బందికి జండర్ స్పృహమీద, స్త్రీల అంశాల మీద అవగాహన శిక్షణలు నిర్వహించడం చేస్తుంటాం. ఆయా కార్యక్రమాల నిర్వహణలప్పుడు ట్రయినింగ్లో పాల్గొనే సిబ్బందితో చాలా విషయాలు మాట్లాడుతుంటాం. వారి వ్యక్తిగత జీవితాల్లోని వొత్తిళ్ళు, వారి ఆరోగ్యం, పిల్లల చదువులు, వాళ్ళకి దొరికే రిలాక్సేషన్ ఈ విషయాలన్నీ చర్చకు వస్తాయి. ప్రతి నిమిషం కేసులతో, నేరస్తులతో, బందోబస్తు, విఐపిలు రక్షణలలో తలమునకలుగా ఉండే పోలీసుల కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితం కూడా మా శిక్షణలో భాగంగా ఉంటాయి. అంటే ఈ విషయాలను కూడా వారు మాట్లాడేటట్టు మేము ప్రోత్సహిస్తాము. పిల్లల్ని చూడలేకపోతున్నామని, తాము డ్యూటీ నించి వెళ్ళేటప్పటికి వాళ్ళు నిద్రపోయారని, తాము డ్యూటీకి బయలుదేరేటప్పటికి వాళ్ళు నిద్ర లేవరని, చాలా రోజులపాటు పిల్లల్ని చూడలేమని, వారితో క్వాలిటీ టైమ్ గడపలేమని చెబుతారు. భార్యతో గడిపే సమయం కూడా చాలా తక్కువగా ఉండడంవల్ల తమ మధ్య అగాధాలు ఏర్పడతాయని, కుటుంబ జీవితం ఒడిదుడుకులుగా ఉంటే అది తమ ఉద్యోగ బాధ్యతల మీద ప్రతిబింబిస్తుందని చాలా బాధపడుతూ చెప్పినవారూ ఉన్నారు. అందరిలాగా తమకి ఒక రోజు సెలవుంటే, తమ కుటుంబంతో సంతోషంగా గడపగలిగితే తమ వొత్తిళ్ళు చాలా వరకు తగ్గిపోతాయని చాలా మంది చెబుతారు. పై నేపథ్యంలోంచి చూసినప్పుడు ఇటీవల ఆంధప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వ ఏర్పడిన తర్వాత పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయించడం ఎంతైనా ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ నిర్ణయం ఒక్క ఆంధప్రదేశ్‌లోనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా అమలు జరిగితే పోలీసుల పనితీరులో గొప్ప మార్పువచ్చే అవకాశం ఉంది. వారూ అందరిలా ఒక రోజు సెలవు తీసుకుని, కుటుంబం ముఖ్యంగా పిల్లలతో గడపగలగడం, వారి చదువు సంధ్యల్లో పాలుపంచుకోగలగడం అనేది వారిని వొత్తిళ్ళు నుంచి తప్పకుండా బయటపడేస్తుంది. ఈ మంచి నిర్ణయం తీసుకున్నందుకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం వారికి, డి.జి.పి. గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. పోలీసుల ఉద్యోగ ధర్మం ప్రజలను రక్షించడం. ప్రజలకు తోడునీడగా ఉండడం. ఎవరికి ఏ కష్టమొచ్చినా, ఏ సమస్య వచ్చినా జనానికి మొదటగా గుర్తొచ్చేది పోలీసులే. తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని కొండంత ఆశతో పోలీస్ స్టేషన్‌కి వస్తారు. ముఖ్యంగా మహిళలు, గృహహింసకు గురవుతూ తనని బాధపెట్టిన, కొట్టిన, పట్టించుకోకుండా వదిలేసిన భర్త మీద ఫిర్యాదు చెయ్యడానికి స్టేషన్‌కి వస్తారు. తన భర్తని పిలిపించి కొట్టకుండా బుద్ధిచెప్పమంటారు. కొంచెం బెదిరించి తనని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి కాపురం చేసేలా చెయ్యమని హింసకు గురైన మహిళలు పోలీసుల్ని కోరతారు. తాగొచ్చి తనని కొట్టే భర్తకి బుద్ధి చెప్పమని అడుగుతారు. హత్యలు, అత్యాచారాలు, దొంగతనాలు, దోపిడీలు, దొమ్మీలు లాంటి కేసులతో బిజీబిజీగా ఉండే లా అండ్ ఆర్డర్ పోలీసులకి నిత్యం స్త్రీలు ఎదుర్కొనే హింసల అంశం చిన్నదిగా కనిపిస్తుంది. చాలా సార్లు మహిళలపై జరుగుతున్న గృహహింసకి అర్థం చేసుకోవడంలో విఫలమౌతారు. చిన్నచిన్న అంశాలకే ఎందుకు పోలీస్ స్టేషన్లకి వస్తారు అని స్త్రీలకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. కానీ స్త్రీలు ఎదుర్కొనే హింసని స్త్రీల దృష్టి కోణంలో అర్థం చేసుకోమని, వారి సమస్యల్ని, వాదనల్ని సహానుభూతితో అర్థం చేసుకోమని మేము నిర్వహించే శిక్షణలలో చెబుతాము. పోలీసులు తమ ఉద్యోగ నిర్వహణలో ప్రతి రోజూ చూసేవి, వినేవి నేరాలు, ఘోరాలే. విధి నిర్వహణలో చాలా సార్లు అంగవైకల్యం పొందడం, ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. రోజూ నేరస్తుల్ని డీల్ చేయడంలో సున్నితత్వం కోల్పోయి దుర్భాషలు, పరుష పదజాలం ఉపయోగించడం అలవాటైపోతుంది. కాఠిన్యం, కరకుదనం మూర్తీభవించిన కొందరు అధికార్లను చూసినప్పుడు వీరు మానసికంగా తీవ్ర వొత్తిడిలో ఉన్నట్లు అర్థమౌతుంది. రాత్రింబవళ్ళు డ్యూటీలో ఉండడం, కుటుంబ జీవితం కోల్పోవడం, పిల్లలతో సమయం గడపలేకపోవడం లాంటివి తప్పకుండా వారి మీద ప్రభావం చూపుతాయి. ఒక పక్క డ్యూటీలో తీవ్ర వొత్తిళ్ళు, మరో పక్క పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ రింగ్ టోన్లు. చాలా పెద్ద కాంట్రడిక్షన్. ఈ మధ్య ఒక పోలీస్ అధికారి సంయమనం కోల్పోయి ‘‘నువ్వు ఆఫ్టరాల్ సివిలియన్. నేను పోలీస్ అధికారిని నా ముందు తలవొంచుకొని నిలబడకుండా తలెగరేస్తున్నావేంటి? ఏం పొగరా’’ అని గద్దించగానే అవతల నిలబడిన వ్యక్తికి చాలా కోపమొచ్చి ‘‘మేడం మీ అమ్మ, నాన్న, మీ కుటుంబం అంతా ఆఫ్టరాల్ సివిలియన్లే. పోలీసులైతే తల మీద కొమ్ములుంటాయా’’ అని అడిగాడట. కాసేపటికి వరకు ఆమెకు నోట మాట రాలేదట. ఆ తర్వాత అతని పరిస్థితి ఏంటి అనేది పోలీసుల వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు తేలికగానే అర్థం చేసుకుంటారు. ప్రజలతో స్నేహంగా, సున్నితంగా వ్యవహరించడం పోలీసుల ప్రథమ బాధ్యత అని ఆమె కెవరు చెప్పాలో? పోలీసులకు వారాంతపు సెలవు ప్రకటన వెలువడి, పోలీసుల హర్షాతిరేక స్పందన చూసాక, చదివాక నాకు దానిమీదనే ఈ సారి నాకాలమ్ రాయాలనుకున్నాను. దాదాపు రెండు దశాబ్దాలుగా పోలీసులతో కలిసి పనిచేస్తున్నాను. మహిళా పోలీస్ స్టేషన్లలో సపోర్ట్ సెంటర్లు నడుపుతునాం. పోలీసుల జీవన శైలుల్ని దగ్గరగా చూస్తున్నాను. వారితో సంభాషించేటప్పుడు, ముఖ్యంగా మహిళా సిబ్బందితో మాట్లాడేటప్పుడు ఒక్క రోజూ సెలవు లేని వాళ్ళ కుటుంబ జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సంసార బాధ్యత, పిల్లల చదువు, సంధ్యలు, ఆఫీసు డ్యూటీలు ఆమెని తీవ్ర వొత్తిడికి గురిచేసాయి. అనివార్యంగా దాని ప్రభావం ఉద్యోగ జీవితం మీద పడుతుంది. దేశంలోని తొలిసారి పోలీసులకు వారాంతపు సెలవు ప్రకటించి, ఒక మంచి సంప్రదాయానికి జన్మనిచ్చిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం వారికి, ఆంధప్రదేశ్ డిజిపి శ్రీ డి. గౌతమ్ సవాంగ్ గారికి మన:పూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.