యూనిట్

ఫ్రెండ్లీ పోలీసింగ్‍ అంటే.. ఎలా ఉండాలి?

నిన్న భూమిక హెల్ప్లైన్‍కి (18004252908) ఒక కాల్‍ వచ్చింది. అది ఒక పోలీస్‍స్టేషన్‍కి సహాయం కోసం వచ్చిన ఒక మహిళ నుండి వచ్చింది. (ఇది ఏపీకి సంబంధించిన పోలీస్‍ స్టేషన్‍ కాదు) ఆమె తొమ్మిది నెలల గర్భంతో ఉంది. ఆమెకి తోడుగా 75 సంవత్సరాలు పండు ముసలావిడ ఉన్నారు. అప్పటికి రెండు గంటలుగా ఆమె పోలీస్‍స్టేషన్‍ బయట ఎండలో నిలబడి ఉంది. ఆ పోలీస్‍స్టేషన్‍కి వేరేపని మీద వెళ్ళిన ఒక స్టూడెంట్‍ మాకు ఫోన్‍చేసి వివరాలు చెప్పింది. కేసు వివరాల్లోకి వెళితే తొమ్మిది నెలల గర్భంతో ఉన్న ఆమెను ఒక వ్యక్తి చాలా కాలంగా ఫోన్‍లో వేధిస్తున్నాడట. ఆమె భర్తకి అసభ్య మెసేజీలు పంపించడం, ఈమెకి తనకి లైంగిక సంబంధం ఉందని, ఆమె కడుపులో బిడ్డకి తనే తండ్రినని, ఆమెను వదిలేయమని... ఇంకా రకరకాలుగా వేధిస్తున్నాడు. ఒకసారి ఆమె భర్తా అతనిని పిలిచి మాట్లాడారట, వార్నింగ్‍ ఇచ్చారట. అయినా అతను మారలేదట. వాట్సాప్‍లో, ఫేస్‍బుక్‍లో మీ గురించి రాస్తాను మీ ఫోటోలు మార్ఫింగ్‍ చేస్తానని బెదిరిస్తున్నాడట. ముందు సహకరించిన భర్త ఈమెనే తిట్టడం మొదలుపెట్టాడట. దీనిమీద కంప్లయింట్‍ ఇవ్వడానికి ఆమె పోలీస్‍స్టేషన్‍కి వచ్చింది. తొమ్మిది నెలల గర్భిణి.. గంటల తరబడి ఎండలో నిలబడటం, కనీసం ఆమెని కూర్చోబెట్టి ప్రయారిటీగా ఆమెతో మాట్లాడి, ఆమె కంప్లయింట్‍ని తీసుకుని వెంటనే పంపించేయాల్సిన పోలీసులు ఆమె పట్ల వ్యవహరించిన తీరు చాలా అమానవీయంగా ఉంది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత గానీ ఆమెతో మాట్లాడలేదు. ఆ స్థితిలో ఆమె పోలీస్‍స్టేషన్‍కి రావాల్సిన అగత్యం ఏమొచ్చిందో విచారించలేదు. మూడు, నాలుగు గంటల పాటు తీవ్ర మానసిక వేదనతో పాటు నిలబడటం, కనీసం మంచినీళ్ళు తాగకపోవడంతో పోలీస్‍స్టేషన్‍ నుంచి ఆమె హాస్పిటల్‍కి వెళ్ళాల్సివచ్చింది. ఆమెకు సహాయంగా వచ్చిన 75 సంవత్సరాల వాళ్ళ అమ్మమ్మ ఇదంతా మేనేజ్‍ చేయాల్సివచ్చింది. పోలీసుల్ని విమర్శించడానికి నేను ఇదంతా రాయలేదు. పోలీస్‍స్టేషన్లు మానవీయంగా, జండర్‍ స్పృహతో ఎందుకుండాలో రాయాలని నా ఉద్దేశ్యం. రకరకాల సమస్యలతో, పోలీసులు తమ సమస్యలు వింటారు, పరిష్కారం చూపిస్తారనే ఆశతో, నమ్మకంతో ప్రజలు పోలీస్‍ స్టేషన్‍కి వస్తారు. ప్రజల రక్షణ కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది. కాబట్టి తమ కొచ్చే ప్రతి చిన్న సమస్యకి స్టేషన్‍కి పరుగెత్తి వస్తారు. ముఖ్యంగా మహిళలు మన దేశంలో స్త్రీల మీద జరుగుతున్న దాడులు, హింస, లైంగిక నేరాలు చాలా ప్రమాదకరస్థాయిలో పెరిగి పోతున్నాయి. గృహహింస ఏ స్థాయిలో స్త్రీల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయో పోలీసులకు తెలియంది కాదు. ప్రతి రోజూ ఎంతోమంది బాధిత మహిళలు పోలీస్‍స్టేషన్‍లకి వస్తూనే ఉంటారు. సాధారంగా మహిళలు తమకు తెలిసిన పద్ధతుల్లో తాము ఎదుర్కొనే గృహహింసకు పరిష్కారాలు అన్వేషిస్తారు. కుటుంబ పెద్దలతో, కుల పెద్దలతో చెప్పుకుని భర్తని సరైన దారిలో పెట్టాలని ప్రయత్నిస్తారు. తాగొచ్చి ఒళ్ళు హూనం చేస్తూ హింసిస్తున్నప్పుడు తమ బతుకు ప్రమాదంలో పడినప్పుడు రక్షణకోసం పోలీస్‍లని ఆశ్రయిస్తారు. పూర్వం స్టేషన్‍లకి రావడానికి భయపడినవారు ప్రస్తుతం ఫ్రెండ్లీపోలీసింగ్‍ పేరుతో ప్రజలకు దగ్గరవుతూ తమ ముఖచిత్రాలని మార్చుకుంటున్న పోలీసుల దగ్గరకు రావడానికి, తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజలు భయపడటం లేదు. పోలీస్‍ వ్యవస్థలో ఇదొక మంచి పరిణామం. అంతేకాదు ప్రజలతో మమేకమవ్వడానికి పోలీస్‍వ్యవస్థ ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలను చేపట్టి, అమలు చేస్తున్నారు. షీటీమ్స్, మహిళా రక్షక్‍, సబల, చేరువ వంటి అనేక మంచి కార్యక్రమాలు ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా పనిచేస్తున్నాయి. అయితే పై స్థాయిలో ఉండే అధికారులకు కిందిస్థాయిలో పనిచేసే సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంటోంది, ఎలాంటి భాషను ప్రయోగిస్తున్నారు? తమ వద్దకు వచ్చిన వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు లాంటి వాటిని గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థ ఉందో లేదో నాకు తెలియదు. పోలీసువ్యవస్థ ప్రతిష్ట, గౌరవాల వ్యక్తీకరణకు కొలమానాలు పోలీస్‍స్టేషన్‍లో ఉండే వాతావరణం, వారి ప్రవర్తన, వారు వాడే భాష, జెండర్‍ సెన్సిటివిటీ, సామాజిక సమస్యల పట్ల అవగాహన, ముఖ్యంగా మహిళలు, పిల్లల పట్ల వారు వ్యవహరించేతీరు. ఇదే పోలీసు వ్యవస్థ ముఖ చిత్రాన్ని అద్దంలో చూపిస్తుంది. మేము మహిళా కారాగారంలో పనిచేస్తున్నాం కాబట్టి వివిధ పోలీస్‍స్టేషన్‍ల నుండి జైలుకొచ్చే ఖైదీలతో మాట్లాడే అవకాశం ఉంది. చాలా సార్లు బలమైన గాయాలతో జైలు కొస్తారు. రెండు, మూడు రోజులు స్టేషన్‍లలో ఉండిపోయిన వారు వస్తారు. పోలీసులు మాట్లాడే భాష, వారి శరీరభాష ఇవన్నీ చెబుతారు. మేము చాలా సార్లు ఆయా పోలీస్‍స్టేషన్లకి వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్‍ వ్యవస్థలో ఇలా జరుగకూడదు కదా అని వాదించిన సందర్భాలు ఉన్నాయి. ఈ వ్యాసం మొదట్లో నేను ప్రస్తావించిన గర్భిణీ స్త్రీ అంశంతో మొదలుపెట్టి పోలీస్‍స్టేషన్‍లు జెండర్‍ స్పృహతో ఎలా ఉండొచ్చు, ఉండాలి అనే విషయం మీద రాయాలనుకుంటున్నాను. ప్రస్తుతం పోలీస్‍స్టేషన్‍లు ఆధునిక వసతులతో విశాలంగా ఉంటున్నాయి. వనరులకు కూడా లోటు లేదు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వికలాంగులు తమ ఫిర్యాదులు దాఖలు చేసుకోవడానికి పోలీస్‍స్టేషన్‍కి వచ్చినప్పుడు వారికి ప్రాధాన్యతనిస్తూ, వారు కూర్చోడానికి ఒక గదిని కేటాయించొచ్చు. అక్కడ మంచి నీళ్ళు ఏర్పాటు ఉండాలి. వారి సహాయం కోసం ఒక హ•ంగార్డును అక్కడుండేలా చూడొచ్చు. వృద్ధులొచ్చినప్పుడు వారిని ఎక్కువ సేపు ఉంచకుండా పంపించి వేసేలా చర్యలు తీసుకోవచ్చు. వారికి ఎన్నో వృద్ధాప్య సంబంధ వ్యాధులుండొచ్చు. మందులు వేసుకోవాల్సి రావొచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా.. పోలీసులకు ఇవేమీ అధికభారం కలిగించే అంశమేమీ కాదు. వారి దృష్టికోణాలకు సంబంధించిన అంశమిది. చివరగా పోలీసులు వాడే భాష విషయంలో గురించి అధికారి స్థాయిలో ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే పోలీస్‍స్టేషన్‍లో మహిళా సిబ్బంది కూడా ఉంటారనే స్పృహ తప్పకుండా కలిగించాలి. అన్ని స్థాయిల సిబ్బందికి జెండర్‍ ట్రయినింగ్‍ తప్పనిసరి చెయ్యాలి. జెండర్‍ స్పృహతో, సున్నితంగా ఎందుకుండాలి. ప్రజలతో ఎలా వ్యవహరించాలి, పోలీస్‍ వ్యవస్థ ప్రతిష్ట ఇనుమడించేలా ఎలా పనిచెయ్యాలి, పోలీస్‍ వ్యవస్థ ప్రతిష్ట ఇనుమడించేలా ఎలా పనిచెయ్యాలి అనే అంశాలను జెండర్‍ ట్రయినింగ్‍లో అర్థం చేయిస్తారు కాబట్టి ఈ ట్రయినింగ్‍లు అందరికీ తప్పనిసరి కావాలి. ఈ ప్రయత్నాలన్నీ అమలైనప్పుడు పీపుల్స్ ఫ్రెండ్లీ పోలీస్‍ వ్యవస్థ ఏర్పడి ప్రజల ప్రేమాభినమాలను చూరగొంటుంది.

వార్తావాహిని