యూనిట్
Flash News
చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు - పిల్లల భద్రత

చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్లు - పిల్లల భద్రత - కొండవీటి సత్యవతి ఉదయం పేపర్ తిరగేస్తే కంటికి కనిపించే వార్తలు ఆ రోజంతా మనసును వెంటాడుతుంటాయ్. స్త్రీల మీద, పిల్లల మీద జరుగుతున్న లైంగిక అత్యాచారాలు వేధింపులు అడ్డూ, అదుపు లేకుండా కొనసాగుతున్నాయ్. ముఖ్యంగా భవిష్యత్ ఆశాకిరణాలు ఈ దేశానికి విశిష్ట సంపదగా, సంతోషంగా, సంబరంగా ఎదగాల్సిన పిల్లలు ఇంట్లో, ఇంటి బయట, పాఠశాలల్లో ఎదుర్కొంటున్న హింస, లైంగిక వేధింపులు మనసును కల్లోల పరుస్తున్నాయి. పాపం, పుణ్యం, ప్రపంచ మార్గం తెలియని అమాయక బాలబాలికలు క్రూరమైన హింసల మధ్య భయం భయంగా బతకడం చాల దుఃఖం కలిగిస్తున్నది. స్త్రీలకి పిల్లలకి భద్రమైనవిగా ప్రచారంలో ఉన్న కుటుంబాల్లో హింస పెచ్చరిల్లడం ప్రమాద ఘటికలను మోగిస్తున్నది. జాతీయ స్థాయి గణాంకాలు చెప్పుతున్నది ఏమిటంటే పిల్లలు తమ స్వంత ఇంటిలోనే, స్వంత బంధువుల వల్లనే లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు గురౌతున్నారు. తాతలు, మామయ్యలు, మేనమామలు, బావలు, బాబాయిలు, అన్నతమ్ములు వీళ్లంతా బాలలకు చాల ఇష్టమైన బంధువర్గాలు, పిల్లలు సంకోచం లేకుండా నమ్ముతారు వీళ్ళని. తమని అమాయకంగా నమ్మిన పిల్లల్నే ఈ బంధువులు టార్గెట్ చేసుకుని వారి మీద వేధింపులకు, లైంగిక హింసలకి పాల్పడుతు న్నారని జాతీయ స్థాయి గణాంకాలు చెబుతున్నాయి. బయట వ్యక్తుల్ని పిల్లలు తొందరగా నమ్మరు. పాఠశాలల్లో కూడా పిల్లల నమ్మకాన్ని పొందిన వాల్లే పిల్లల మీద వేధింపులకి పాల్పడుతారు. బెదిరించి, భయపెట్టి తమ అక•త్యాలను కొనసాగిస్తారు. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో పిల్లలకి తెలియదు. తమ మీద ప్రేమ చూపించే వాళ్ళను చాల తేలికగా నమ్మేస్తారు. ఒక చాకోలెట్, ఒక ఐస్ క్రీం ఆశ వీళ్ళని తేలికగా కుట్రదారుడి బుట్టలో పడేస్తాయి. ఈనాటి కుటుంబ జీవితం ఎవరిని ఎవరు పట్టించుకునే పరిస్థితిలో లేదు. టీవీలు, సెల్ ఫోన్లు, చాటింగ్‌లు వెరసి టెక్నాలజీ మనుష్యుల్ని ఒంటరి దీవులుగా మార్చేస్తాయి. పిల్లల జీవితాల్లో జరుగుతున్న సంక్షోభాలను పసిగట్టి వారికి వెన్ను, దన్నుగా ఉండే వెసులుబాట్లు క్రమంగా దూరమై పోవడం అత్యంత విషాదకరం. తండ్రుల దుర్వ్యసనాలు, తల్లుల జీవన పోరాటాలు పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్ధకం చేస్తున్నాయి. పెద్దల జీవన శైలులు కూడా పిల్లల్ని ప్రమాదపుటంచుల్లోకి నెట్టేస్తున్నాయి. ఇటీవల జీడిమెట్లలో జరిగిన ఒక కేసు గురించి తప్పక ప్రస్తావించాలి. కొంతమంది సోషల్ వర్క్ విద్యార్థులు తమ పనిలో భాగంగా ఒక ప్రభుత్వ పాఠశాలలో సెషన్ తీసుకున్నారు. ఎవరైనా తన పర్సనల్ పార్టస్ ని స్ప •శించారా? తమకు ఇబ్బందికరంగా అనిపించిందా? రాయమని అడిగినప్పుడు ఒక బాలిక ఏదో రాయాలని ప్రయత్నించి, రాయలేదని, రాసింది కొట్టేసిందని రిసోర్స్ పర్సన్‌గా ఉన్న విద్యార్థిని అర్థం చేసుకుంది. ఆ పాపతో విడిగా మాట్లాడినప్పుడు తన ఇంట్లోనే పాప అనుభవిస్తున్న లైంగిక హింస గురించి చెప్పింది. తల్లి దండ్రులు లేని ఆ పాప తన పిన్ని ఇంట్లో ఉంటోంది. పిన్ని కోసం రాత్రిళ్ళు ఆమె ఇంటికొచ్చే ఒక వ్యక్తి ఆ పాప మీద లైంగిక అత్యాచారం చేసాడని, ఎప్పుడూ తన బట్టలు విప్పమంటాడని, తన చెల్లెలు పట్ల కూడా అంతే చేస్తాడని, ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని అన్ని వివరంగా చెప్పింది. చైల్డ్ లైన్, సి డబ్ల్యూ సి, డి సి పి సహకారంతో ఆ పాపను రక్షించడం జరిగింది. ఆ పాపని హోంలో ఉంచడం వల్ల సి డబ్ల్యూ సి తన భవిష్యత్తు, చదువు గురించి నిర్ణయం తీసుకోగలుగుతుంది. ఇటీవల ఇలాంటివే ఎన్నో కేసులు వెలుగులోకి వచ్చాయి. పాఠశాల దశ నుండి పిల్లలకి అన్ని అంశాల పట్ల అవగాహనా కలిగిస్తే, వాళ్ళు తమ మీద జరుగుతున్న హింసని అర్థం చేసుకోవడమే కాక తమ బాధని పంచుకోగలుగుతారు. ఒక విద్యార్థి చేసిన ఒక ప్రయత్నం. ఆ బాలిక పడుతున్న హింసకి ఫుల్ స్టాప్ పెట్టగలిగిందంటే ఎంతమంది పిల్లలు మౌనంగా తమ దుఃఖాలను దిగమింగుతున్నారో అర్థమౌతుంది. అసలు ఈ అంశాలన్నీ పిల్లల పాఠ్య పుస్తకాల్లో పాఠాలు అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్త్రీలు పిల్లల రక్షణ కోసం అమలులో కొచ్చిన చట్టాల గురించి, సపోర్ట్ సిస్టమ్స్ గురించిన సమాచారం పిల్లలకి చదువు ద్వారా, పాఠ్యంశాల ద్వారా అందినప్పుడు వారిలో అవగాహనా పెరుగుతుంది. తమ పట్ల జరిగే హింసల్ని, వేధింపుల్ని అర్థం చేసుకోగలుగుతారు. 1098 లాంటి చైల్డ్ లైన్ నంబరుకని వారికి దగ్గరగా తీసుకెళ్లి మీకు ఎలాంటి సమస్య ఎదురైనా 1098కి కాల్ చేయండి అని చెప్పి భరోసా ఇచ్చినప్పుడు పిల్లలు సాధికారులవుతారు. పిల్లలకు సంబంధించి అమలులో ఉన్న వ్యవస్థలు, సంస్థల గురించి రాయాలంటే ముందుగా పేర్కొనవలసింది. ప్రతి పోలీస్ స్టేషన్లలోను ఉండే చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్, జిల్లా శిశు రక్షణాధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటి, చైల్డ్ హెల్ప్ లైన్. బాలల భద్రత సంక్షేమం కోసం ఇన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఉండే చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పాత్ర చాల ముఖ్యమైంది. ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో పిల్లల మీద ఎలాంటి అఘాయిత్యం జరిగినా సిడబ్ల్యూసికి చాల ముఖ్యమైన బాధ్యత ఉంటుంది. పిల్లల భద్రతకు సంబంధించి మిగిలిన వ్యవస్థలు, సంస్థలతో కలిసి పాఠశాలల్లో చైతన్య పరిచే కార్యక్రమాలు చెయ్యడం, ప్రివెన్షన్ మీద ఫోకస్ తో పని చేయడం చెయ్యాలి. పోలీస్ స్టేషన్ లో ఉండే చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ పిల్లలతో వ్యవహరించే ప్రతి సందర్భంలోను మాములు దుస్తుల్లోనే ఉండాలి. యూనిఫామ్ పిల్లల్ని భయపెడుతుంది. సిడబ్ల్యూఓగా పనిచేస్తున్న అధికారికి పిల్లలకు సంబందించిన సహాయ సంస్థలు, సి డబ్ల్యూ సి ల సమాచారం అంతా తెలిసి ఉండాలి. వారి ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచుకోవాలి. అలాగే పిల్లల అంశాల మీద పని చేసే స్వచ్చంద సంస్థల వివరాలన్నీఉంచుకోవాలి. పిల్లలని ఉంచే హోమ్స్, జె జె బోర్డు మెంబర్ల వివరాలు ఉండాలి. ముఖ్యంగా బాధిత పిల్లల స్టేటుమెంట్ ను పోలీస్ స్టేషన్ లో రికార్డు చెయ్యకూడదు. పిల్లలకి అనువుగా, భయపడకుండా ఉండే స్థలాల్లోనే రికార్డు చెయ్యాలి. బాలబాలికల మీద విచ్చలవిడిగా పెరిగిపోతున్న లైంగిక హింసలు, అఘాయిత్యాల నేపథ్యములో ప్రతి పోలీస్ స్టేషన్ లోను ఉండే చైల్డ్ వెల్ఫేర్ అధికారి జెండర్ సెన్సిటివిటీతో, సున్నితంగా పిల్లలతో వ్యవహరించాలి. ఇటీవల ఒక పోలీస్ స్టేషన్ లో పోలీస్ డ్రెస్సులో ఉన్న అధికారి పిల్లల్ని గద్దించి, చాల మొరటుగా ప్రశ్నించిన సందర్భంలో ఇదంతా రాయాల్సి వచ్చింది. ప్రజలు, పోలీసులు, పిల్లల రక్షణ కోసం ఉన్న వ్యవస్థలు, యన్ జీ ఓ లు అందరం కలిసి పిల్లల్ని రక్షించుకోవాలి. వారి పట్ల సున్నితంగా వ్యవహరించాలి.