యూనిట్

పోలీసులు- సమాజం

విశాఖ జిల్లాలో ప్రత్యేకమైన పుణ్యక్షేత్రాలలో మొదటగా చెప్పుకోవలసింది సింహాచలం, శ్రీ వరహా లక్ష్మి నృసింహస్వామి దేవాలయం. ఈ పుణ్యక్షేత్రానికి ప్రతి రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. సంవత్సరానికి ఒక్కసారి జరిగే చందనోత్సవము. స్వామి వారికి గందం వొలుపు కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి వేలకొలది భక్తులు వస్తుంటారు. ఈ చందనోత్సవానికి మొదటి రోజు విజయనగర రాజరికానికి చెందిన ఈనాటి కేంద్రమంత్రి అశోకజగపతిరాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, స్వామి వారి గందం వొలుపు కార్యక్రమానికి నాంది పలుకుతారు. అంతటి ప్రత్యేకత వున్న ఈ దేవాలయానికి మా విశాఖపట్నం ప్రజలు ప్రతీ సంవత్సరం తప్పనిసరిగా వెళ్తారు.

నేను, మా వారు, మా కుటుంబ సభ్యులం ఈ స్వామి దేవాలయానికి వెళ్తుంటాము. పోయిన నెలలో మా కుటుంబంతో సింహాచలం దేవాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం అనంతరం మధ్యాహ్నం స్వామివారి అన్నమారాధనకు (ప్రసాదము స్వీకరించు కొనుటకు) లైనులో నుంచోని వున్నాము... ఖాళీ దొరికితే యిద్దరు ఆడవాళ్ళు కలిస్తే చాలు. ఆ విషయం, ఈ విషయం అని లేకుండా అన్ని విషయాలు మాట్లాడుతుంటారు కదా!

ఆమె ''నాతో మాటలు కలుపుతూ, ''ఈ సింహాచలం దేవాలయానికి యిప్పుడే వచ్చారా... ప్రతీ సంవత్సరము వస్తారా!'' ''అని అంటే''. నాది విశాఖపట్నం సిటీయే! ప్రతీ సంవత్సరం వస్తాము.'' అంటూ ఆమెతో మాటామంతి కలిసింది.

''మరి మీరు కూడా తరచూ వస్తారా... మీ ఊరు ఎక్కడ'' అని నేను అడిగాను. మా వారు నా పిల్లలతో సరదా కబుర్లతో వున్నారు...

ఆమె మాటల్లో, ఈ వరహా లక్ష్మి నరసింహస్వామి (సింహాచలం) గుడికి అప్పుడప్పుడు వస్తూ వుంటాను. యిప్పుడు ఎందుకు రావలసి వచ్చిందంటే....రాత్రి పడుకున్న తరువాత కలలో ''యమభటులు'' కనిపించారు. ఈ యమభటుల కల కోసం, మా అమ్మకి చెప్పితే అమ్మా ''యమభటులు'' అలా కలలోకి రాకూడదు! అంటూ దగ్గరలో వున్న దేవాలయానికి వెళ్లమని సలహా యిస్తే... అడవివరం అనేవాళ్ళ గ్రామానికి దగ్గర ,అవడము వలన దగ్గరలో ఈ సింహాచలం వచ్చాను అని చెప్పింది.

ఆమె మాటకు అడ్డుపడి యమభటులు ఎలా ఉంటారు ? అయినా కలలు అనేక రకాలుగా వస్తుంటాయి. అన్నింటిని సెంటిమెంటుగా తీసుకోవడము సరికాదేమో అన్నాను. వెంటనే నా మాటకు మధ్యలో ''అయ్యో యమభటులు అంటే సినిమాల్లో, నాటకాల్లో చూసిన వాళ్ళుకాదండి... పోలీసోల్లు'' అని ఆమె అనే సరికి నా మైండు బ్లాక్‌ అయ్యింది... ఆ మాట చూచాయగా విన్న మా వారు ఖంగుతిన్నారు. వెనుకా ముందు చూడకుండా, ఏమీ ఆలోచించకుండా ఆమె గలగలా యింకా ఏమీ మాట్లాడుతుందంటే! ''అవునండి పోలీసులకి జాలి, దయ, కరుణ వుండవండి, మనల్ని చాలా కర్కటంగా చూస్తారు. మనపట్ల కఠినంగా వ్యవహరిస్తారు... అంటూ... మా వీధిలో పండ్ల దుకాణాలు, తోపుడు బండ్లు వున్నాయండి, వాళ్ళని కూడా వదలరు... వారినుండి ప్రతీ రోజు మామూలు వసూలు చేస్తుంటారు..'' అనీ యింకా చెప్పబోతుంటే! 

'ఆపండి, ఆపండి! వినలేకపోతున్నాను' అంటూ ఆమె మాటలకి పుల్‌స్టాప్‌ పెట్టకపోతే యింకా యింకా ఎంత ఘోరముగా పోలీసు డిపార్టుమెంటు కోసం ఏమి చెప్పేదో  ఆనకట్ట వేశాను... వేస్తూ... ఆమె మాటలు ఆపుతూ! ఏమండి మా వారు పోలీసే! అని ఆమెకి చెప్పాను. ఆమె ముఖము మాడిపోయిన మసాల దోశెలా అయ్యింది... గొంతులో తడి ఆరిపోయినట్లు గుటకలు మింగుతూ..''సారీ  అండీ, మీ వారు పోలీసు అని తెలియక నోటికి... వచ్చినట్లు మాట్లాడాను'' అని, మా వారికి కూడా ''క్షమించండి సార్‌ అంటూ'' ''సారీ, సారీ'' అంటూ పదేపదే చెప్పసాగింది... ఆ మాటకి మా వారు అందుకుని' ఎందుకు అన్ని సారీలు, జరుగుతున్నదే, మీరు చూసిందే  మా డిపార్టుమెంట్‌ మీద చెప్పారు. మా వ్యవస్థ కోసం మీకు తెలిసిందీ, మీరు చూసింది యింతే, యిందులో మీ తప్పు లేదు... మేమంటూ లేకపోతే మీరందరూ కూడా గుండెల మీద చేయివేసుకుని హాయిగా. పడుకోగలరా! దర్జాగా భయట తిరగ్గలరా... మీ ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయగలరా, పోకిరీలు, గుండాలు వున్న ఈ సమాజంలో దర్జాగా మీ ఆడవాల్లు తిరగ గలరా! ఎక్కడో...ఎవరో తప్పు చేశారని, 'యమభటులు''గా మమ్ములను భావించి చెడ్డగా మాట్లాడటం సబబు కాదమ్మా... మీకు తోపుడుబల్లు వారి వద్ద వసూలు మాత్రమే కనిపిస్తుంది. మా కష్టం, మేము మా కుటుంబానికి దూరంగా వుంటూ  చేసే శ్రమ మీకు కనిపించదు.  ఎండనకా, వాననకా, ఏజెన్సీ ఏరియాలలో పనిచేస్తున్న మా సహోదరులు ఎంతమంది వున్నారో మీకు తెలియదమ్మ... ఏజెన్సీ ప్రాంతాలు అయిన చింతపల్లి, గూండు కొత్తవీధి, అన్నవరం... ఈ గ్రామాలు అన్ని మన విశాఖ జిల్లాలో పేరుపొందిన నక్సల్స్‌ స్థావరాలుగ వున్న ప్రాంతాలు. అక్కడికి ఆ అడవుల్లోకి విధుల కోసం వెళ్ళిన మేము ఏ క్షణాన, ఏమౌతుందో అని మాకు, మా భర్తలు ఏజెన్సీ ప్రాంతాలకి వెళ్ళారు తిరిగి వచ్చేవరకు యిదిగో నా లాంటి పోలీసు భార్య, పిల్లలకు యిక్కడ టెన్షన్‌, టెన్షన్‌తో వుంటారమ్మా!

యిక మైదాన ప్రాంతాలు అంటే మన విశాఖసిటీయే, అంతెందుకు మీ గ్రామం, అడవివరం, ప్రక్కనే వున్న.. గోపాలపట్నం జంక్షన్‌ యిలా, ఉదాహరణగా చెప్పుకుంటే, ఎండలో కూడా ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తూ... మా సోదరులు చేమటలో తడుచుకుంటూ... ఎంత కష్టంగా పనిచేస్తూ.. రోడ్లమీద ట్రాఫిక్‌ క్రమంగా, సక్రమంగా, నిర్వహించేలా చేస్తున్నారో మీరు గమనించలేదా! ఆ పోలీసు వారు, ఆ జంక్షన్‌లో లేకపోతే  ప్రజలు, మాట వింటారా... సక్రమంగా రోడ్డుమీద రూల్స్‌ పాటిస్తారా.. అడ్డదిడ్డంగా వెళుతూ యాక్సిడెంట్లు చేసుకోరా! యింకా మేము పగలు, రాత్రి గస్తి  ఎంత తిరుగుతున్నా.. అడపా దడపా దొంగతనాలు జరిగితే ఆ సంఘటన స్థలానికి వెళ్ళి ఎంక్వయిరీ చేసి దొంగలను పట్టుకుని బాధితునికి పోయిన నగలు, డబ్బు.. కోర్టుద్వారా యిప్పించడం మీకు తెలియదు. యింకా విఐపిలు, వివిఐపిలు రాష్ట్ర ముఖ్యమంత్రి, దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి యిలా ఎందరో ప్రముఖులు మన నగరానికి వస్తే.. ప్రజల ఆగడాలకి, మీ ప్రజల వలన ఆ వివిఐపిలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా బందోబస్తు నిర్వహిస్తుంది పోలీసులేనమ్మా! అంతెందుకు మీ అడవివరం గ్రామంలో గ్రామదేవత జాతర అయితే మీకు కనిపించేది మా పోలీసులే. ఆ జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, పిక్‌ పాకెటింగ్‌ లాంటివి జరుగకుండా ఆ జాతరను విజయవంతంగా జరిపించేది మా పోలీసులే నమ్మా. మొత్తము మీద ఏ కార్యక్రమానికైనా, ఏ బందోబస్తుకైనా అందుబాటులో వుండేది మా పోలీసులే అని. మా వారు ఎదురు సమాదానము చెప్పేసరికి ఆమెకు తేరుకోవడం కష్టమయ్యింది... ఈలోగా అన్న సమరాదనకు తలుపులు తెరవగా ఎవరికి వాళ్లము వేరువేరుగా భోజనాలు ముగించాము.

నిజమే కదండి రాష్ట్రంలో కొన్నివేల మంది పోలీసులు శ్రమించి పనిచేస్తున్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలా ఎవరో ఒకరు తప్పు చేస్తే... మొత్తము వ్యవస్థల గురించి చెడ్డగా మాట్లాడం కరెక్టు కాదు కదండి!  ఒక టీచరు, ఒక బ్యాంక్‌ ఉద్యోగి, యిలా చాలా డిపార్టుమెంట్లు వారు ఉదయం డ్యూటీకి వెళ్ళి.. సాయంత్రం యింటికి చేరి తమ భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతారు.. యిటువంటి జీవితం మాకూ కావాలి అని మా లాంటి పోలీసు భార్యలు అనుకుంటారు. ఒక పండుగ వచ్చినా, యింటిలో ఏమైనా శుభకార్యం జరిగినా ఒక్కొక్క సందర్భంలో మా భర్తలకు శెలవు దొరక్క ఆడవాళ్ళము అయిన మేము మా పిల్లలతో పండుగలు జరుపుకుంటూ వుంటాము. కాని మా వారు సమాజము కోసం శ్రమిస్తున్నారు.. ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకై పాటు పడుతున్నారు అనే తృప్తి మాలో నాటుకు పోవడము వలన మా పోలీసు భార్యలు జీవితాలు హాయిగా హ్యాపీగా వున్నాయి. ఏమైనా మా భర్తలు డ్యూటీలో కష్టపడిన కష్టము, వారు అనుభవిస్తున్న తృప్తిలో భార్యలుగా మేము సగం అనుభవిస్తున్నామని.. అనుకుంటూ, వారికి అనువణువున తోడుగా వుంటూ వారు డ్యూటీ సక్రమంగా చేయు లాగున మా వంతు కృషి చేస్తున్నాము. ఏమైనా ప్రజలు, ధన, మాన, ప్రాణ, రక్షణకు అహర్నిశలు, ఎండనకా, వాననకా, కష్టపడుచూ, కుటుంబాలకు దూరంగా వుంటూ శ్రమిస్తున్న పోలీసులుందరికీ కృతజ్ఞతలు...

వార్తావాహిని